ప్రపంచ కవితా దినోత్సవం – టీజీవోస్ కవుల కవితల సంకలనం

TGO NEWS : World poetry day tgos employees

ముందుమాట

కవిత్వమే తొలి ఉద్యమ రూపం
ఏ ఉద్యమానికైనా చాలకశక్తిగా పని చేసేది సాహిత్యం .అది ఒక ఆశయం కోసం పోరాడుతున్నవారిని ఐక్యంగా ఉంచడానికి ,కలసి నడవడానికి దోహదం చేస్తుంది .మానవ జాతి ప్రస్థానంలో సాహిత్య సృజన ఒక విడదీయరాని భాగం .ఉద్యమానికి ఊతమే కాదు ..సమస్త మానవీయ విలువలు ఉద్వేగాలు వ్యక్తీకరణకు ఒక వారధిగా నిలుస్తుంది.మానవ సభ్యత వినాశనానికి దారితీస్తున్న ఈ యుగంలో కళా సాహిత్యం మానవ సమాజాన్ని రక్షిస్తాయి.సద్భావాలను వికసింప చేస్తాయి.


ప్రజా సాహిత్య సృష్టిలో తెలంగాణకు అద్వితీయ స్థానం ఉంది .ధిక్కార స్వరాలు పోతన సోమన హన్మంతు కాళోజీ సురవరం దాశరథి నవీన్ వెంకన్న వంటి వారెందరో తెలంగాణ సాహిత్యాన్ని సుసుసంపన్నం చేశారు.
ఈ అపురూప సాంప్రదాయాన్ని తెలంగాణ గెజిటెడ్ అధికారులు సంఘం తన ఆవిర్భావం నుండే తనలో ఇముడ్చుకుంది.ఈ విశిష్ట సాహిత్య సంస్కృతి సాగులో తన వంతు పాత్రను పోషిస్తున్నది.

ఈ వెలుగులో ప్రపంచ కవిత్వ దినోత్సవం సందర్భంగా మన ప్రియ సోదరుడు ,బహుముఖ ప్రజ్ఞత గల కవి రచయిత సామాజిక కార్యశీలి అస్నాల శ్రీనివాస్ మరియు షేక్ బికారి సాహెబ్ ల ఆధ్వర్యంలో టి జి ఓ సాహితీ మిత్రుల కవితలతో “టి జి ఓ పూల పరాగాలు “అంతర్జాల సంకలనం వెలువరిస్తునందుకు హృదయపూర్వక అభినందనలు.కవితలు రాసిన టి జి ఓ సాహితీ మిత్రులకు శుభాకాంక్షలు

సాహిత్య అభివాదాలతో

ఏలూరి శ్రీనివాసరావు
అధ్యక్ష్యుడు
ఏనుగు సత్యనారాయణ
ప్రధాన కార్యదర్శి
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం

****************

సమీక్ష

సమాజ చైతన్యం కవిత్వం
పొట్లపల్లి శ్రీనివాసరావు
ప్రముఖ కవి
పూర్వ సహా అధ్యక్ష్యుడు
టి జి ఓ పూర్వ వరంగల్ జిల్లా

మిత్రులకు
ప్రపంచ కవిత్వ దినోత్సవ శుభాకాంక్షలతో…

కవిత్వం బంధాల కూడలి గాయాల కడలి ….పొట్లపల్లి

కవిత్వదినోత్సవ సందర్భంగా కవిగా రచయితగా ఉద్యమ కార్యకర్తగా పరిచయమైన అస్నాల శ్రీనివాస్ పిలుపు మేర…ఉద్యోగ మిత్రుల నుండి కవితలు వచ్చాయి. వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రవృత్తి రీత్యా ఉన్న భావనను కవితామయం చేశారు.

కవితల్లో ఆసక్తి ఉన్నవారు తపన ఉన్నవారు ఎంతోకొంత అప్పుడప్పుడు రాస్తున్నవారు ఇంకా ఇతర కళా సాంస్కృతిక రంగాలలో
అభినివేషమున్నవారు కూడా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భాల్లో అది వారి ఒత్తిడి నివారణకు ఒక ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాక ప్రజలు అవసరాల దృష్ట్యా బట్టి అధికారుల వద్దకు వచ్చినప్పుడు చాలా మట్టుకు ఎంతో సహనంతో మరింత బాధ్యతతో పనిచేయడం, సమస్యను చిరునవ్వుతో సున్నితంగా పరిష్కరించడం జరుగుతుంది. ఉద్యోగ బాధ్యతను విస్మరించని ఉద్యోగుల కన్నా సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక రంగాలలో వున్న వారికి ఒక శాతం ఎక్కువగా ఉంటుందనేది నిర్వివాదాంశం. సరే.

TGO సాహితి మిత్రుల కవితలు పరిశీలించినప్పుడు
బాలా రిష్టాలు దాటి రాసిన కవితలుగా కనిపిస్తాయి. వస్తువు , సమాజం , కుటుంబం, ఉద్యోగులకు సకాలంలో రావలసిన ఆర్థిక వనరులు మొదలగు అంశాలతో స్పందించిన కవితలు ఆకట్టుకుంటాయి. మనలో ఒక ఆలోచన, ఆచరణకు ప్రేరణ కలిగిస్తాయి.
‘ధరలు ఆకాశాన్ని తాకినా
నీతో మాత్రం నేల లోనే’ అంటూ ఆవేదనతో ఉద్యోగ గర్జన చేస్తున్న వేల్పుల శ్రీనివాస్
ఒక పువ్వులో
ఒక చిరునవ్వులో…
అందం ఆనందం అంటున్నా
Dr. కేసరి నగేష్ ..
సామాన్యుడి తరఫున వకాల్తా
పట్టిన k.సతీష్….
‘ఆశ లేని భవిష్యత్తును చూస్తూ
స్పర్శ తగిలితే పొంగిపోయే’ వృద్ధాప్య దశను తడిమిన D. చైతన్య…
‘కవిత్వం లేని భాష
కవిత్వానికి అందని భావం’..
లేదన్న గొల్లపల్లి రాజ్ కుమార్….
‘విడిపించని సంకెళ్లు
వదిలించుకుంటేనే
స్వతంత్రమైన.. స్వర్గమైన..’
అని స్వేచ్ఛ కోసం రాసిన జ్ఞాన సుందరి…

‘మనసు వినడానికి చిన్న పదం
చదవడానికి తెలివైన పదం’
కానీ మనసును జయించడం కష్టమని తేల్చిన k. శ్రీప్రియ
అభివృద్ధి ఎవరికోసం…లింగుస్వామి

‘వ్రాయాలని అనుకున్నా ..’
అనే భావన తో G. సుధీర్..
‘కాలం విలువ తెలిసిన వాడే విజేత’ యని సమయాన్ని ఒడిసి పట్టుకోవాలనే ఆలోచన తో మురళి…
అక్షరాల గూటిలో,
ఆయుధాలు నింపినంత మాత్రాన
అక్షర మాలలు రాలతాయా అని ప్రశ్నిస్తున్న జ్ఞాన సుందరి

మంచి చెడుల వివేకాన్ని
కలిగించే వారు కవులు. దీపారెడ్డి కవిత

తెలంగాణను కీర్తించిన సయ్యద్ జబీ కవిత
ఇంకా గ ద్వాల కవిత

బానిసత్వాన్ని బాసిజాన్ని
పిడికిలి బిగించి ప్రశ్నించిన చోటు…గురించి చెప్పిన శ్రావణ సంధ్య

పొరుగువారికి మనకు గోడలు నిర్మితమై ఉన్నా
మన హృదయ గవాక్షాలు విశాలంగా ఉండాలని
మనసు తడి నిండిన జలపాతాలు
ఇరువైపులా ప్రవహించాలని ఆశిస్తున్న
అస్నాల శ్రీనివాస్… తన తోటి మిత్రులు నుండి కవిత్వాన్ని ఆహ్వానించారు. అనూహ్య రీతిలో టి జి ఓ సాహితీ మిత్రుల నుంచి వచ్చిన స్పందనతో
సఫలమైందని భావిస్తున్నాను.

తనకు ఉద్యోగ సంఘాల నాయకుల అండ దండలు కూడా పుష్కలంగా ఉన్నవి. మరిన్ని కవితలు సేకరించి కొంత ఎడిట్ చేసి టీజీవో ల తరఫున ఒక కవిత సంకలనం వస్తే బాగుంటుంది. ఒక ఆలోచన.

💐💐💐💐💐💐💐💐💐

🌹వసంత స్వప్నం 🌹 : అస్నాల శ్రీనివాస్

నా యువకాశపు రోజులలో
“పరస్పరపు సంఘర్షించిన శక్తులతో
చరిత్ర పుట్టెను “అనే గమన సూత్రాన్ని
ఆవాహన చేసుకున్న ఆ సమరవీధుల్లో

పోరాట దివిటిలను కొనసాగిస్తూ
రణనినాదాలతో హోరెత్తిస్తూ
లాంగ్ మార్చ్ ను కొనసాగిస్తూ

అలసిపోయి కునుకు తీస్తున్న సమయాన
మానవ సమరసత కోసమై
ఒక వసంత స్వప్నాన్ని కన్నాను
ఒక స్వప్నలోకాన్ని సృజించాను

పొరుగువారికి మనకు గోడలు నిర్మితమై ఉన్నా
మన హృదయ గవాక్షాలు విశాలంగా ఉండాలని
మనసు తడి నిండిన జలపాతాలు
ఇరువైపులా ప్రవహించాలని

సౌఖ్యం కోసం ఇతరులను పీడింపని
సాంఘిక ధర్మం విలసిల్లాలని
సమిష్టి శ్రమ స్వేదాలతో
భూమిని తడపాలని

ఆకాశం పందిరి కింద అందరం
ఆనంద విహారం చేయాలని
సూర్యకాంతి కిరణదారాలతో
సిరుల తరులను పండించాలని

చంద్రవంక మేఘాల నవారుతో ఊయలలూగాలని
కార్తీక పౌర్ణమి వెన్నెల అలలపై
తేలియాడాలని

హరితమో కెంజాయమో ధవళమో ఏదైతేనేమి
అందరం వర్ణపు జడిలో
తడిసి ముద్దవ్వాలని ….

మిత్రులారా! కలం యోధుల్లార
సాంస్కృతిక విప్లవ హాలికుల్లార
శ్రీ శ్రీ కాళోజి వారసుల్లారా

ఆ సుందర స్వప్నాలకు ఒక
ఆవాసం కల్పించడంకై
ఒక ఆకృతిని కలిగించడంకై
కవిత్వమై ప్రవహిద్దాం
కవిత్వంగా కలిసి నడుద్దాము

చీకటిలో మగ్గిపోతున్న
సమరసతను ఊరేగిద్దాం
సామరస్య సాంస్కృతిక కిరణాలను
కవిత్వమై వెదజల్లుదాము
తెలంగాణమే నమూనాగా
బహుళత్వ భారత్ ను సాగుచేద్దాము

అస్నాల శ్రీనివాస్


కోటి రతనాల వీణ – నా తెలంగాణ!! – సయ్యద్ జబీ

అణగారిన తెలంగాణ,
ఆకలి కేకల తెలం గాణ,
బీడు భూముల తెలంగాణ, కరెంటు తీగలపై బట్టలారదీసిన తెలంగాణ,
నీటి కరువు కన్నీళ్ళలో తెలంగాణ,
పంట చేనుల్లో రైతు మర ణాల తెలంగాణ,
ఉరితాళ్ళలో చేనేత తెలం గాణ,
అక్షరం తుడిచిపోయిన తెలంగాణ,
ఉపాధి మరిచిన తెలంగాణ,
సాంకేతిక సమస్యల్లో తెలంగాణ,
అనారోగ్య బారిన తెలంగాణ,
ఆసర లేని వృద్ధాప్య తెలంగాణ,
రక్షణ లేని మహిళా తెలంగాణ,
విలువల్లేని అవమానాల తెలంగాణ,
నుండి పడిలేచిన కెరటం తెలంగాణ,
ఉప్పొంగిన చంద్రశేఖర తెలంగాణ,
జాతిని జాగృతం చేసిన తెలంగాణ,
ఆకాంక్షలు నింపుకున్న తెలంగాణ,
ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ,
అమరుల త్యాగాల తెలం గాణ,
పిడికిలెత్తిన యువ తెలంగాణ,
రాచరిక పునాదులు కదిలించిన తెలంగాణ,
మెడలు వంచి సాధించిన తెలంగాణ,
ఎండమావుల్లో పురుడోసుకున్న పచ్చని తెలంగాణ,
కన్నీరు తుడిచిన కాళేశ్వర తెలంగాణ,
పచ్చని మాగా ణుల్లో పసిడి సిరుల తెలంగాణ,
ఉరితాళ్ళనే చేనేత దారంగా మలిచిన తెలంగాణ,
అక్షరం దిద్దుకొని విజ్ఞానం ముద్దాడిన తెలంగాణ,
దేశ దేశాల పెట్టుబడుల ఉపాధి ధామం తెలంగాణ,
సాంకేతిక సొగసు కాంతుల తెలంగాణ,
ఆరోగ్యమే మహాభాగ్యమైన తెలంగాణ,
వృద్ధాప్యానికి ఆసరా నిలిచిన తెలంగాణ,
సాధికారతలో మహిళల తెలంగాణ,
అంబేడ్కర్ మార్గంలో నడుస్తున్న తెలంగాణ,
కోటి రతనాల వీణ నా బంగారు తెలంగాణ, తలెత్తుకొని నేడు గర్వపడేలా చెబుతుంది
జై బోలో తెలంగాణ.

సయ్యద్ జబీ (లెక్చరర్)
9949303079


मैं हूं किसान
देश का रीड है किसान,
देश का है निशान।
अन्न उगाने वाला है किसान,
भूखा प्यासा है किसान।
मैं हु भारत कि शान
मैं किसान हल जोतना पहचान,
किंतु बना हू सत्ता की दुकान।
बताते मुझे मैं हु अन्नदाता
पशु ,खेत, फसल से मेरा नाता,
सारा जहां मेरी मेहनत से खाता,
क्योंकि मैं हूं किसान।
जन्म मिट्टी से लेकर
दफन मिट्टी में ,
भूखे मारते हैं हम अकाल के
बाढ़ में।
मैं हूं किसान,
मै हू किसान।

SK AZAM – JL IN HINDI

ఓహ్.. : జ్ఞాన సుందరి రచన

అన్ని దారులూ వెనీస్ నగరిలో
భవంతుల మధ్య నుంచి
నడుస్తున్నట్టు ఉండాలి అనుకుంటే ఎట్టా…

వచ్చే ప్రతీ కలలోను కూడా
నిన్నే గొప్పగా పొగడాలి అనుకుంటే ఎలా…

తక్కెడ మనుషుల మధ్య
చిక్కని పాలను స్వచ్ఛంగా
చూడాలనుకుంటే ఎట్టా…

మచు పిక్చు అంత ఎత్తులోనుంచి
నువ్వు నిన్ను బిగ్గరగా పిలుచుకోవాలని,
నిలబడిన చోటే ఉండిపోతే ఎలా…

అక్షరాల గూటిలో,
ఆయుధాలు నింపినంత మాత్రాన
అక్షర మాలలు రాలతాయా..

నవ్వి పోరూ, చుట్టు ఉన్నోళ్ళంతా..!

అలవాటైనట్టే ఉన్నా,
చాలా దూరంలో ఆగిపోతాం.
మనదగ్గరకు వచ్చేసినట్టున్నా,
మన ముందే మాయమైపోతుంది.

పోయి పోయి మాయగాడి చిలుకలో నీ ప్రాణం ఉందంటే ఎలా నమ్ముతావ్..!

ఓడిపొమ్మని, విశ్వం నీతో గుసగుసలాడినా..
దాని చెంప చెల్లుమనిపించడానికి
నీ దగ్గర ఆత్మ విస్వాసం ఉంది కదా..!
పొద్దుపొతే ఊరవతల రతకిలము కూడా చతికిల పడుతుంది.
మరి నీకున్న లెక్కేంటి..?

మట్టే కదా అని, మట్టి ముద్దలా ఉంటానంటావేం.
ఎగసి తన్నే కడలి కొడవలి పదునుతో
అడుగెయ్యరాదూ..!

మహా అయితే ఊహించని విజయం
నీ కాళ్ళకు పసుపు రుద్దుతుంది.
ఉప్పునీళ్ళ సెగకి పురుడు పోసుకున్న
పట్టుదలేగా నీ ఆయుధం.

విడిపించని సంకెళ్ళు
వదిలించుకుంటేనే
స్వతంత్రమైనా..
స్వర్గమైనా..!!!

ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు 💐❤️ :- జ్ఞాన సుందరి


చిరునవ్వు అంటే ఆనందం, – Dr.కేసరి నగేష్

అది హృదయాన్ని తెరుచుకుంటుంది,

చిరునవ్వు అంటే ప్రేమ,అది జీవితాన్ని మార్చివేస్తుంది.

ప్రకృతి అందం పచ్చని చెట్టు,
పూలతో తెలుస్తుంది..
చంద్రుడి అందం
నిండు పౌర్ణమి రోజున కనిపిస్తుంది
సూర్యుని తొలికిరణపు అందం
భూమిపైన పడ్డ క్షణాన కనిపిస్తుంది

నేటి సమాజపు అందం
శబ్ద తరంగాలు చేస్తూ
తన గమ్యన్నికై,
పరుగు పెడ్తున్నపుడు కనిపిస్తుంది…

కానీ మనిషి అందం, ఆనందం..
సంతోషంతో వెలుగుతున్న కన్నులు…
చిరు బాధ కూడా లేని చిరునవ్వును
చూస్తే కానీ తెలీదు,
అందం అంటే పైకి
కనిపించే రంగులు కావు
మనసుకు మాత్రమే
కనిపించే ఒక అందమైన భావనా !!!..

ఆనందం అంటే ఏమిటో,
చెప్పలేను నేను ఏమీ,
కాని అది ఒక చిరునవ్వు,
ఒక చిన్న ఊయలలో ఉంటుంది.

చిరునవ్వు అంటే ఆనందం,
అది హృదయాన్ని తెరుచుకుంటుంది,
చిరునవ్వు అంటే ప్రేమ,
అది జీవితాన్ని మార్చివేస్తుంది.

పచ్చని మొక్కలు, నీలి ఆకాశం,
పక్షుల కిలకిలారవాలు,
ప్రకృతి అందించే ఆనందం,
అది ఒక అద్భుతమైన సందేశం.

జీవితం అంటే ఆనందం,
ప్రతి క్షణం ఒక సాహసం,
ప్రతి నిట్టూర్పు ఒక గీతం,
ప్రతి చిరునవ్వు ఒక కవిత.

     *అందం*

అందం అంటే ఏమిటో,
చెప్పలేను నేను ఏమీ,
కాని అది ఒక పువ్వులో,
ఒక చిరునవ్వులో ఉంటుంది.

పచ్చని మొక్కలు, నీలి ఆకాశం,
పక్షుల కిలకిలారవాలు,
ప్రకృతి అందం అంటే ఇదే,
అది ఒక అద్భుతమైన సందేశం.

మనసు అందం అంటే,
ప్రేమ, దయ, కరుణ,
అది ఒక అద్భుతమైన భావం,
అది జీవితాన్ని మార్చివేస్తుంది.

చంద్రుని అందం అంటే,
అది ఒక మాయా లోకం,
అది ఒక అద్భుతమైన స్వప్నం,
అది ఒక అనుభూతి.

Dr.కేసరి నగేష్
సహాయ వ్యవసాయ సంచాలకులు
.


ఉద్యోగి గర్జన – హక్కుల కోసం మహాసంగ్రామం – వేల్పుల శ్రీనివాస్

కదలరా ఉద్యోగి… నిద్రలేవరా?
నీ శ్రమకు గౌరవం తెచ్చుకునే వేళ వచ్చింది!
నీ న్యాయ పోరాట గళం,
సమాజాన్ని శివమండలి మాదిరి దహించేందుకు సిద్ధమైంది!

ఉదయాన్నే లేచి పరుగులు తీసి,
రాత్రివరకు కష్టపడే నీ శరీరం,
ప్రభుత్వ యంత్రానికి ఊపిరి పోసే నీ శ్రమ,
ఏ రోజు వెలుగును చూసిందో చెప్పు?

PRC ఓ మాట మాత్రమేనా?
సప్లిమెంటరీ బిల్లులు వాయిదాల బానిసలా?
నీకు హక్కులే లేవా? న్యాయం నీకెందుకు దూరం?
ఉద్యోగి శ్రమకు అర్హత గౌరవం ఎప్పుడొస్తుంది?

ధరలు ఆకాశాన్ని తాకినా,
నీ జీతం మాత్రం నేలలోనే ఎందుకు?
నీ కుటుంబం ఆకలి వేడిని అనుభవిస్తున్నా,
ప్రభుత్వం మాటలతో మభ్యపెడుతూనే ఉంటుందా?

పదవీ విరమణ వచ్చినా,
పడకమీద పెన్షన్ కలలోనే ఉండాలా?
ఆరోగ్య సమస్యలతో పోరాడినా,
ఉద్యోగి జీవితానికి ఆదరం లభించదా?

ఇక నువ్వు మౌనంగా ఉండకూ,
నీ గళం గొంతెత్తు!
నీ హక్కులు సాధించే దారి,
నీ ఉద్యమంతోనే తేలాలి!

ఈ పోరాటానికి సారధి అయ్యి,
ఉద్యోగుల ఆకాంక్షలకు వేదికగా మారిన,
TGO రాష్ట్ర అధ్యక్షులు ఎలూరి శ్రీనివాస్ రావు గారికి,
మనం అందరం రుణపడి ఉంటాం!

నినాదం గర్జించాలి – ప్రభుత్వానికి వినపడాలి!
ఉద్యోగి గుండె ధైర్యం చాటుకోవాలి!
సమయం ఆసన్నమైంది – హక్కులు సాధించే వరకు పోరాటం ఆగదురా!

వేల్పుల శ్రీనివాస్
Associate president
Tgo mahabubabad


అక్షరమే కవిత్వం – గొల్లపల్లి రాజ్ కుమార్,

కవిత్వం లేని భాష లేదు.
కవిత్వానికి అందని భావము లేదు.
మనసులోని భావాలని అక్షర రూపంగా
కవితలను రాస్తూ కమనీయమైన
జీవితాన్ని జీవిస్తూ ఎప్పటికప్పుడు
కవిత్వంతో అందరిని
ఉర్రూతలూగించేది నిజమైన కవిత్వం.
పోరాటం నేర్పి స్తుంది కవిత్వం.
ప్రతి ఒక్కరిలో విజయాన్ని చూపిస్తుంది.
శ్రమైక జీవికి చైతన్యం నేర్పించే ఖరీదైంది కవిత్వం.
ఆయుధం పడితేనే న్యాయం అనే అభయం మరొకరిది.
ఒకరు సిరాలో మమతను నింపి మదిని మురిపిస్తారు,
మరొకరు సిరాతో చైతన్యాన్ని నింపి సమాజాన్ని శాసిస్తారు.
ఒకరి ప్రయత్నం ఆకలిని తరమాలని.
నా హృదయ భావాన్ని నింపితే జాలువారే ప్రతి అక్షరం కవిత్వమే.
కవి నుండి జారిన అక్షరాలు మనసుని విహంగ వీక్షణం చేయిస్తాయి.

గొల్లపల్లి రాజ్ కుమార్, భౌతిక శాస్త్ర అధ్యాపకులు.


ఓ సామాన్యుడా …కూన సతీష్


నీ మాటకు పలుకుబడి ఏడున్నది
డబ్బు నీ చెంత ఉంటే ఉన్నది
కులం నీ వెంట ఉన్నపుడు ఉన్నది
ఆత్మాభినం తాకట్టు పెట్టుకున్నపుడు ఉన్నది

ఓ సామాన్యుడా…
నవ సమాజం నూతనంగా మారింది
కులం కుమ్ములాటతో
డబ్బు మంద బలంతో
బానిసపు ఆలోచనతో
బ్రతుకులు తెల్లరుతున్నాయి

ఓ సామాన్యుడా..
నీతి సమాజం సచ్చిపోయింది
చీము నెత్తురు లేను సంఘాలు మొలకెత్తాయి
ప్రశ్నిచే వాడి పరాయి వాడుగాను
దోచుకున్నోడు దొరగాను మారాడు
ఓ సామాన్యుడా…
నీజం మాట్లాడడం గొంతులు మరిచాయి
ప్రశ్నించే గొంతులు సంతలో అమ్ముడుపోయాయి
ఆర్తనాదాలు, రాజకీయ సమీకరణాలకు బలిఅయ్యావు.
ఓ సామాన్యుడు
గమ్యం తెలియని ప్రయాణంలో
నిత్యం అన్వేషణ సాగిస్తూ
సహకరంలేని సంఘంలో
ఒంటరిగా జీవిస్తున్నాడు
గిట్లైతే
మనిషి సంఘజీవి అనేదెట్ల?

కూన సతీష్.
JL in physics


Oh! My love,my heart,
Without you my life is a desert.
You are my inspiration.
To search for you is my determination.
To meet you is my passion.
To grab you is my intention.
To hold you and Owns you is my mission.
(About Book)

జి.సుధీర్ కుమార్
టి జి ఓ వరంగల్


తరుణీ ఓలే తరువు : సతీష్ కుమార్

తరుణీ ఓలే తరువు
జగతి ఆకలి తీర్చ
పుడమి పై ఒక విరాగి అయి
నిల్చున్నది.

తణువెళ్ల తన ఫలాల తో
రాబోయే కాలానికి, ప్రకృతి
లో తాను ఒక భాగంగా
పరోపకారం కోసం

ఉగాదులు ఉషస్సులు ఎన్ని
ఉన్న తాను తామసి
అయి విశ్వ ప్రేమ ను
పంచడానికి తన జీవితం అంకితం చేస్తూ

మానవత్వం అంటే ఏమిటో
తెలిసిన మనుషుల కన్న
మిన్న గా తన ఆణువణువును
త్యాగం చేస్తూ, ఈ ప్రపంచానికే
ఆదర్శం గా నిలుస్తోంది తరువు

లేలేత ప్రాయం నుండి తను
నమ్మిన సిద్దాంతాలను
ఏమార్చక, తను మారక
ఎందరి కో జ్ఞానోదయం చేసి
బోధి సత్వల్ని చేసింది

మనిషి తన మనుగడ కోసం
ప్రకృతి కి వికృతి గా మారి
మారణ హోమం లో మరణ మృదంగం వాహిస్తున్న
మనిషి లో మార్పు కోసం
తన జీవితం త్యాగం చేస్తు
సజీవ సాక్ష్యం గా నిలబడింది
తరునీమణి తరువు

పరోపకారం ఇదం శరీరం అని ఆర్యోక్తి ని తన జీవితం అంత
పాటిస్తూ, ఈ అనంత జీవ కోటికి
పదే పదే చాటి చెప్తూనే………

సతీష్ కుమార్
ఎంపీడీఓ
జక్రాన్ పల్లి మండలం
నిజామాబాద్ జిల్లా


రాయమన్నారు,రాద్దామని కూర్చున్నాను.పెన్ను కదలనంటోంది,మస్తిష్కం మొద్దుబారిపోయింది.అప సవ్య,అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దేందుకు నా ఆలోచనలను అక్షరబద్దం చేసి కవిత గా మార్చేందుకు నేను కవిని కాను.కథ గా రాసేందుకు రచయితను కాను. పోరాటాల పురిటి గడ్డ ఓరుగల్లు గడ్డ లో పుట్టిన బిడ్డను.ఎలుగెత్తి చాటుతున్నా.సమాజాన్ని మార్చేందుకు నీవు సమిధవు కావాల్సిన అవసరం లేదు.అగ్నికణమైతే చాలు.వజ్ర సంకల్పం ఉంటే చాలు.నీ చుట్టు ఉన్న అజ్ఞానాంధకారాన్ని తిట్టుకుంటూ కోర్చోకు,నీవు రక్తపు బొట్లను చిందించాల్సిన అవసరం లేదు.నీ మేధస్సును మధించి లక్ష మెదళ్ళను విజ్ఞానామృత భాండాగారం చేయి చాలు.నీ ఆలోచనలను పుస్తకాలుగా మలచి,వాటిని ఆ లక్ష మెదళ్ళలో ఇంకి పోయేలా చేయి చాలు.జాతి జాగృతం అవుతుంది.

జి.సుధీర్ కుమార్
టి జి ఓ వరంగల్


మనసూ – మైనస్సు” – కె. శ్రీప్రియ

“మనసు”వినడానికి చాలా చిన్న పదం చదవడానికి చాలా తేలికైన పదం.
ప్రతి రోజూ వందల సార్లు వాడే పదం కానీ ఆ మనసుని ఇంత వరకు జయించిన మనిషి ఉన్నాడా అంటే ?

బహుశా లేడనే చెబుతాం అనుకుంటా?

అసలు ఈ మనసు ఏంటి ? అది ప్రాణమున్న మాంసమా? కాదనే అంటాం అడిగితే

మరి అది గాయ పడినపుడు ఎందుకంత నొప్పి ?

ఎందుకంత అలజడి, ఎందుకు అంత నిస్సహాయత ?

ప్రాణం లేని మనసుకు ఎందుకంత విలువ?

అదే మనసు ఆనందంగా ఉంటే అంతు లేని ఆనందం, అవదుల్లేని ఆరాటం, ఎవరెస్ట్ ని అధిరోహించినంత గర్వం.

సమాజంలో జరిగే ప్రతి చిన్న విషయానికి మొదటిగా స్పందించేది ఈ మనస్సే

పోనీ మనం ఆడిగామా అంటే అదీ ఉండదూ, మనసు ఒక నియంత అనే చెప్పాలి, ఎవరి చెప్పుచేతల్లో ఉండని ఒక పెద్ద విప్లవమే అని చెప్పాలి

మనసుని నియంత్రించడానికి మహా మహా మేధావులకే సాధ్యపడలేదు, అలాంటిది సామాన్యునికి సాధ్యమా?

స్ఫూర్తిదాయకుల మాటలు విన్నపుడు చదివినపుడు మనసుని జయించవచ్చు అనే ఆలోచన దావాగ్నిలా మానసులోకే చేరుతుంది.

హతవిధీ!
అది ప్రయత్పించే లోపే మన వల్ల కాని పని అని అంతే వేగంగా చల్లారుతుంది.

ఇదే మనసూ- మైనస్సు
కె. శ్రీప్రియ
AO FCO ల్యాబ్ వరంగల్


ఎక్కడున్నాం… మనం.. :- అనిత

రోదసి
రాకెట్స్ లాంచింగ్

ఏర్టిఫిషల్ ఇంటలిజెన్సీ
క్లౌడ్ క్లోనింగ్

జలంతర్గముల వినియోగం
ఎన్నో రంగాలలో
శాస్త్రియం గా పురోగతి ని సాధిస్తున్నాము..

సృష్టి లో సగం అయిన అతివ జీవితం మాత్రం యింకా అతలాకుతలమే

మహిళా సాధికారత
సమానహక్కులు
బేటీ బచావో

మొత్తం అన్ని నేతిబీరకాయ లో నెయ్యి ఉన్నంత సత్యం..

సృష్టి కి మూలం అయిన స్త్రీ మూర్తులు మాత్రం గృహహింస అనే మహమ్మారీ చేతిలో బలి అవుతూనే వున్నారు..

చదువుకొని
ఆర్థిక స్వాతంత్రం వున్న స్త్రీ మూర్తులు కూడా సమాజం కట్టుబాట్లు.. పరువు…అనే . రక్కసి కోరాలలో రక్తం మోడుతూ వున్నారు…


(2)..#నేటి సమాజం #

కొలమానానికి అందని ఈర్ష్య,ద్వేషాలు

పెల్లుబుకిన అహంకార..
అభద్రతలు..

పెరిగిన దూరలు..
అతకనంతగా విరిగిన మనసులు.

కాలగర్భం లో కనుమరుగయిన
రక్త బంధాలు

నిర్గాంతపోయేలా పెరిగిన వైషమ్యాలు

కలికాలం ఇంతే అనుకోవాలా?
విరుగుడు లేని విషప్రభావం అనుకోవాలా?

అనిత గద్వాల్


వృద్ధాప్యం

అనుభవాల మూట
జ్ఞాపకాల వేట
మూలగ కుర్చుంది నవారు మంచంపై కదలిక లేకుండా
ఈసడింపుల మధ్య నిర్లక్ష్యపు చూపుల మధ్య
నలుగుతు ములుగు తుంది
ఆశలేని భవిష్యత్తును చూస్తూ
ముడతలు పడిన దేహన్ని దూరం నుంచే ప్రేమించే
ప్రేమానురాగాలకై కన్నీళ్లు జాలు వారుస్తుంది
ముసలితనం ఓ పాపంలాగే కనిపిస్తుందేమో యవ్వనానికి
ఆదరించడానికి
ప్రేమగా అక్కున చేర్చడానికి
నీస్పర్శ తగిలితేనే పొంగిపోతుంది
ఆహృదయం
పాడైపోయిన టీ.వి. కాదు
కాలం చెల్లిన వస్తువుకాదు
పనికి రాదంటు పక్కన పడేయటానికి
నిన్ను పుట్టించిన రక్తమాంసాలకి
నిన్ను పెంచిన స్వేద బిందువులు
నీకు పేగు పంచిన బంధం
నిన్ను ఈస్టితికి చేర్చిన గురువు
నువ్వు కొలవాల్సిన దైవం
ఇదంతా పూజించమని కాదు
ప్రేమించమని
నీబాల్యాన్ని తానెంత ప్రేమించిందో
ఎంత కాపుకాచుకొని జాగ్రత్తగా పెంచిందో
ఎంత ఇష్టంగా నీకు గోరుముద్దలు తినిపించిందో
అంతే ప్రేమగా… అంతే ఇష్టంగా… అంతే జాగ్రత్తగా
తన వృద్ధాప్యాన్ని ప్రేమించు
ఇది ప్రతి తల్లి చివరి కోరిక.

డి.చైతన్య (డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్) రోడ్లు భవనాల శాఖ జనగామ జిల్లా. టీ.జి.వో. జనగామ జిల్లా.సాంస్కృతిక కార్యదర్శిని

అభివృద్ధి ఎవరి కోసం? – లింగస్వామి

(ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా)

అధిక వేగంతో అభివృద్ధి పరుగులు,
అలుపెరుగని యంత్రాల నడకలు,
కంచుకొండల్ని ఛేదించిన మార్గాలు,
కానీ… ప్రాణాలను కాపాడలేని పరిజ్ఞానం!

గాలి కన్నీరు పెట్టుకున్నా గమనించేవారు లేరు,
మెటల్లు మురిసినా హృదయాలు మెలివి కానివి,
టన్నెల్ మట్టిలో మునిగిన నిండు ప్రాణాలు,
విద్యుత్ అగ్నిలో కాలిన కుటుంబ కలలు!

ఎవరికీ ఈ అభివృద్ధి? ఎటువైపు ఈ పరుగులు?
వచ్చే తరం కోసం మిగిలేది ఏమిటి?
ప్రకృతి సహజమై, మానవతా విలువలతో,
మనుషుల రక్షణే నిజమైన విజయం కదా!

ఆకుపచ్చ గాలిలో ఆనంద శ్వాసనివ్వండి,
మృత్తికా గుండెల్లో మరణ గీతలు గీయకండి,
కనీస భద్రతే కనీస హక్కుగా మార్చండి,
అదే నిజమైన అభివృద్ధిగా నిలుస్తుంది!

@ ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు!


నాన్న

నాన్న! నువ్వు కోపంగా మాట్లాడుతుంటే
ప్రశాంతతే తెలీయదనుకున్న!
కల్లెర్ర చేస్తుంటే నీది
కాఠిన్య హృదయం అనుకున్న
మౌనంగా నువ్వుంటే
నాతో మాటలే
నీకు ఇష్టం లేదనుకున్న
ఆజ్ఞలు నువ్వేస్తుంటే
బానిసగానే బాధపడ్డ
నాన్న
నాకిప్పుడు తెలుస్తుంది
వీటన్నింటి వెనుక
మూలసూత్రం ఒకటుందని
అది నాపై అమితప్రేమని
నా బాగుకోసం
భవిత కోసం నీ ఆరాటం అని!
ఎన్నడు కన్నీళ్లు రాని కళ్ళు
అబద్ధాలు చెప్పని పెదవులు
నిజమైన ప్రేమ
వీటికి మారుపేరు మా నాన్న!

డి.చైతన్య (డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్) రోడ్లు భవనాల శాఖ జనగామ జిల్లా. టీ.జి.వో. జనగామ జిల్లా.సాంస్కృతిక కార్యదర్శిని


కాలంతో సాగే కవిత్వమా – డా. జి. దీపారెడ్డి

ఆకాశానికి లేదు హద్దు
సెలయేరుకు లేదు అలుపు
కవి కలానికి లేదు సంకెళ్ళు
భూత కాలాన్ని వివరిస్తూ
ప్రస్తుత కాలాన్ని తెల్పుతూ
భవిష్యత్ ను ఊహిస్తూ
ఆలోచనలను ఆచరణ లో పెడుతూ
కాలానుగుణముగా సంభవించే అలజడులను
భావోద్వేగాలకు మధ్య జరిగే సంఘర్షణను మార్పు వైపుకు చాలక శక్తిగా పని చేసేదే కవిత్వం .
మంచి చెడుల వివేకాన్ని
కలిగిస్తూ
తన చూపుతో
నిరంతరం జగమంతా సత్సంకల్పం లోకి చేరే వరకు
చైతన్యపు దిశలో ప్రగతికి దారి చూపుతూ
విప్లవ శంఖమై జన సంద్రానికి వినిపిస్తూ ఉంటారు కవులు

డా. జి. దీపారెడ్డి


శీర్షిక: మళ్ళీ పుట్టింది : శ్రావణ సంధ్య

ఆ చోటు
అణగారిన చైతన్యాన్ని అక్కసుతో నేలకూల్చిన చోటు

ఆ చోటు
విప్లవాన్ని నీరుకార్చామన్న అహంకారం ప్రజ్వరిల్లిన చోటు

ఆ చోటు
ఇటుక ఇటుకగా కట్టుకున్న
ఉద్యమతత్వాన్ని
ఇసుకమేటగా చేసిన చోటు

ఆ చోటు
బానిసత్వాన్ని బాసిజాన్ని
పిడికిలి బిగించి ప్రశ్నించిన చోటు

కాలాన్ని దాటి కష్టాన్ని దాటి
కార్మికుల కర్షకుల
పోరాట ఫలితాన్ని
శిలగా తొలచి
స్తూపంగా మలచి
తరతరాలకు అందిస్తే

ఓకే ఒక్క వాహన యంత్రంతో
మట్టిపాలు చేసిన వేళ

మళ్ళీ పుట్టిందో చెయ్యి
పిడికిలి బిగించి
శిధిలాల మీద శిలాక్షరాలు రాయడానికి
జననిర్లిప్తతకు జనగణమన
పాడటానికి

….శ్రావణసంధ్య


ఏ దేశం చూసినా ఏమున్నది గర్వకారణం…….నన్ను నమ్ము నమ్ము అని నట్టేట ముంచుతున్నది ఈ ఆస్తికం ……

కళ్ళముందు నిప్పు లాంటి నిజాలు కనిపిస్తున్నా… నమ్మకూడదని చెప్పే కల్లే ఈ ఆస్తికం……….

అభాగ్యుల దోపిడీకి , దౌర్జన్యానికి కారణం ఈ ఆస్తికం……..

అంటరానితనం అనే ముసుగులో మానవత్వ విభజనకు విభేదనకు మూలం ఈ ఆస్తికం………..

ఆ బడుగు జీవుల ఆవేశ ఆక్రందనల శేషం ఈ ఆస్తికం……..

మన అక్క చెల్లెళ్ళు అని చెప్పుకుంటునే వారిని చెప్పు కిందనే…. చెప్పు చేతల్లనే ఉండాలని చెప్పేదే ఈ ఆస్తికం……..

బానిస ఆశాజీవుల నిలువెత్తు దోపిడీఏ ఈ ఆస్తికం………

దాన్ని ధిక్కరించి ప్రశ్నించే వాడి గొంతుపిసుకాలని ,అణగదొక్కాలని చూసేదే ఈ ఆస్తికం……..నా నుండి చిన్న నాస్తిక విప్లవ రచన

……….రోహిత్ చింతల
……..ఉద్యాన అధికారి
TGO’s karimnagar vice president
Karimnagar జిల్లా


బాల్యం – మనం మరవకూడనిది…

మా మనసు మేఘంలా తెల్లగా ఉంటుంది,
మాకెవ్వరూ దూరం కాదు,
కులం, మతం, రంగు తెలియని మనసులం మేము,
స్నేహం అనే పంథాలో కలిసి పోతాం.

డబ్బు మాట మాకు సుదూరం,
నవ్వులే మా ధనం, ఆటలే మా సంపద,
ఒకరికొకరం చేతులు కలిపి
పచ్చని పొలాల్లో పరుగు తీస్తాం.

పాటల్లో మేము పక్షులం,
వానలో మేము చినుకులం,
నిన్న, రేపు అనే పుస్తకాలు మాకు లేవు,
ఇవాళ్టి సంతోషమే మాకు ఎనలేని సంపద.

కల్మషం లేని చూపులతో,
అమ్మ ప్రేమను మెత్తని మడిగా మోస్తూ,
మేఘాల మీద పయనం చేసే కలలు కంటాం.
ఎవరూ మాకు వేరుగా కనిపించరు.

పేరు మీద ధ్యాస లేదు,
ముందు తరాల కోసం కూడబెట్టె యావ లేదు,
పరపతులు పని చేయని పసి మనసులు మావి,
అదే మా బలం…

ఓ బాల్యమా… నీ స్వచ్ఛతతో మేము పరవశించాము,
నిన్ను మర్చిపోని మాకు ప్రతి రోజు,

ఈ బాల్యపు తెల్ల మేఘాలు,
ఎప్పటికీ నెమ్మదిగా మన మదిలో మెదలాలి…🙏

  • డా.అనిశెట్టి శ్రీధర్